Tuesday, 10 July 2018

రోజు రోజుకు క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం


"రోజు రోజుకు క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం"

ఈ వాక్యం చాలా కీలకమైనదిగా భావిస్తాను. 

పుస్తకం పేరు గుర్తులేదు కానీ...... వ్యక్తిత్వ వికాసం కు సంబంధించి నేను చదివిన వాక్యం బాగా ప్రభావితం చేసింది.  "EVERY DAY IN EVERY WAY I AM GETTING BETTER AND BETTER". తెలుగులో దీనర్ధం "రోజు రోజుకూ క్రమ క్రమంగా అన్నింటా నేను అభివృద్ధిని సాధిస్తాను". 'నేను' అనే స్థానంలో 'మనం'ను చేర్చడం సరయినదనేది నా అభిప్రాయం. ఓ వ్యక్తి ఏది సాధించినా దాని వెనుక చాలామంది సహకారం ఉంటుంది. విజయం ఎపుడూ 'జనవిజయం' గానే ఉంటుందని నమ్ముతాను. వ్యక్తి టేలంట్ ఇంప్రూవ్ కావాలన్నా 'నేను' కు 'మనం' తోడూ కావాల్సిందే. ఈ నేపధ్యంలో  ఆ వాక్యాన్ని ఇలా మార్చుకున్నాను.

"EVERY DAY IN EVERY WAY WE ARE GETTING BETTER AND BETTER"


ప్రతి వ్యక్తీ ఎదో ఒకటి ‘సాధించడం’ లేదా ‘ఎదగడం’ ను కోరుకోవడం సహజం. సమాజం గొప్పగా గుర్తించాలనే తపన ఉండడం సహజం. అనుకున్నది సాధించే క్రమంలో ఎవరైనా విజయం సాధించాలనే కోరుకుంటారు. చాలామంది విజయం వస్తే పొంగిపోవడం, అవరోధాలు, ఆటంకాలు ఎదురైనపుడు పక్కదోవపడుతుంటారు. ఈర్ష్య, అసూయ, కోపం, ఆందోళన, డిప్రెషన్, నిరాసక్తత, నిర్లిప్తత….ముదిరితే కక్ష పెంచుకోవడం వంటి అనేక అసహజమైన మానసిక జాడ్యాలు కలిగే అవకాశం ఉంది. ఏదీ సాధించకపోయినా మంచిదే కానీ నెగెటివ్ జాడ్యాలు వంటబట్టడం మాత్రం మంచిది కాదు. విజయం సాధించే క్రమంలో కొన్ని అనుభవపూర్వకమైన అంశాలను గమనంలో ఉంచుకుంటే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు

జయమైనా, అపజయమైనా దానిలోనుండి పాఠాలు నేర్చుకోవాలి. విజయం సాధిస్తే కేవలం మన టేలెంట్ మాత్రమే అనుకోకుండా సహకరించిన వ్యక్తులు, అనుకూల అంశాలను గమనంలో ఉంచుకోవాలి. మరో విజయానికి అది ప్రేరణగా ఉండాలి. అపజయం సాధించినా ఇదే క్రమంలో విశ్లేషణ చేసుకోవాలి. మన పనులనుండే కాదు, ఇతరుల జయపజయలనుండీ పాఠాలు నేర్చుకోవాలి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. మనం దేనినైనా సాధించాలంటే ఆ సాధించేది ఎవరికోసం? ఎలా? అన్నది గుర్తుంచుకోవాలి.

మనిషి జీవితమే ఒక ప్రాసెస్. చిన్న పిల్లవాడినుండి ఎదగాల్సిందే ఎవరైనా. తప్పులు చేస్తూ, తప్పటడుగులు వేస్తూ  పడుతూ, లేస్తూ ఎదిగి నడుస్తూ.... 'అవసరమైన మేరకు పరుగు' నేర్చుకోవలసిందే. అసలు ప్రకృతిలో ప్రతీదీ ఓ ప్రాసెస్ గా పద్దతిగా జరుగుతున్నది. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మాలకు లోబడే మనిషి జీవిత ధర్మాలూ ఉండాలి. కాబట్టి క్రమంగా ఎదగడం అన్నది ఓ సూత్రం మాత్రమే కాదు 'ధర్మం' అని కూడా గుర్తించాలన్నది నా అభిప్రాయం. అలాగే ఏదైనా మరొకదానితో సంబంధం కలిగి ఉన్నట్లే మనిషి కూడా నిరంతరం ప్రకృతితో తోటి మనుషులతో, సంబంధం కలిగి ఉండడం ఓ కీలక ధర్మం.

ఏ ఒక్కరూ.. ఒక్కరిగా మాత్రమే దేనినీ సాధించలేరు. సాధించేది కేవలం వ్యక్తికోసమే కాదు, సమాజం కోసం కూడా... అన్నది గుర్తుంచుకోవలసిన మరో కీలక అంశం. ‘నేను’ సాధించేది ‘ఇతరుల’ కోసమే, 'నేను' కు గుర్తింపు నిచ్చేది... ఇవ్వాల్సిందీ.. ‘ఇతరులే’, సహాయపడేది ‘ఇతరులే’ అన్నది గుర్తుండాలి. ‘నేను’ సాదించేది ‘మనం’ కోసమే. ప్రతిది పరిస్తితులు, కాలము, ప్రదేశం పై ఆధారపడి ఉంటాయి. కనుక అవరోధాలు ఎదురైనపుడు వాటిని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. అసహజమైన జాడ్యాలకు లోనుకాకుండా ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు జరిగింది? మరోసారి ఆ తప్పు జరుగకుండా ఏం చేయాలి? అన్నది ఆలోచించాలి. 

ప్రతిరోజూ నిన్నటి మనతో నేటి మనని పోల్చుకుంటూ ప్రయత్నం విడువకుండా లోపాలు సరిచేసుకుంటూ ముందడుగు వేయడమే మనం చేయగలిగిన, చేయాల్సిన పని. ఇతరులకు సహాయపడుతూ, ఇతరుల సహాయం పొందుతూ అందరితో కలసి మనం అభివృద్ధి చెందడం 'అలవాటు'గా మార్చుకోవాలి. అందరి సహకారంతో అందరికోసం విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకోవాలి. వ్యక్తిగతంగా మనలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ఎప్పటికపుడు పదును పెడుతూ క్రమ క్రమంగా అవసరమైన అన్నింటా ముందడుగు వేయాలి.

ప్రారంభించిన వెంటనే ఫలితం కోసం ఆశించకుండా, అపజయం ఎదురైతే అనుభవపాఠం నేర్చుకుంటూ అనుకున్న లక్ష్యం దిశగా ప్రయత్నించాలి. గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఫలితం గురించి దిగులుపడకుండా నిరంతరం కొత్తకోణంలో ప్రయత్నించడమే మనపని. ప్రతిరోజూ మనకు నేర్చుకోవడం అనేది ఓ అలవాటుగా మారాలి. మన జయాపజయాలనుండి, ఇతరుల జయాపజయాలనుండి పాజిటివ్ దృక్పథంతో నేర్చుకుంటూ ఎదగాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అందరికీ సహాయపడేలా, అందరిలో ఒకరిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. అందుకే ‘రోజు రోజుకూ క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం’.

– పల్లా కొండల రావు,
10 జులై, 2018.

Sunday, 8 July 2018

వేగం గమనంలో ఉండాలి


వేగం గమనంలో ఉండాలి

నేటి మానవ జీవితంలో వేగం పెరిగింది. అది అవసరానికి మించి ఉంటోంది. శృతి మించిన వేగం మనిషిని అనేక విధాలుగా నష్టపరుస్తోంది. వేగం వలన కలిగే మంచిని ఉపయోగించుకోవాల్సిందే. అవసరమైన చోట వేగం కొనసాగించాలి. కానీ అదే వేగం మనిషి తత్త్వానికి, మానవత్వానికే 'సవాల్‌'గా మారితే ఏం చేయాలి? ప్రస్తుతం చాలా విషయాలలో వేగం శృతి మించుతోంది. వేగం మనిషిని అతలాకుతం చేస్తోంది. మనసును కల్లోలపరుస్తోంది. మానవ సంబంధాలను మంట గలుపుతోంది. అందరం ఆగి చూసుకోవసిన అవసరం ఉంది. మనం అవసరమైన వేగం కొనసాగిస్తున్నామా? అవసరానికి మించిన వేగంలో మునిగిపోతున్నామా? అనేది తేల్చుకోవలసి వచ్చింది.

మనిషికి జ్ఞానం ఎదిగే కొద్దీ బుద్ధి తగ్గుతోందనిపిస్తోంది. మనిషి అవసరాలకోసం తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారాడు. డబ్బు కోసం పరుగులు పెడుతున్నాడు. డబ్బు ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. జీవితాన్ని నిత్యం పరుగెత్తిస్తున్నాడు. డబ్బు కోసం సృష్టించబడిన 'సరుకుమాయ'లో పడిపోతున్నాడు. డబ్బు సృష్టించే సమస్యతో సతమతమవుతున్నాడు. డబ్బు సంపాదించడం కోసం పోటీపడుతున్నాడు. అవసరం కోసం కొందరు, ఆధిపత్యం కోసం కొందరు ఎలా అయితేనేం డబ్బు మనిషిని, మనసును స్థిమితంగా ఉంచడం లేదు. పరుగు పెట్టిస్దోంది. ఈ క్రమంలో మనిషికి రానురాను మెదడు పెరుగుతోంది, కానీ హృదయం తరుగుతోంది. ఏది గొప్పది? ఏది సాధించాలి? ఏది సంతృప్తినిస్తోంది? అనేదానికి అర్ధం లేకుండా పోతున్నది. అర్ధం మారిపోతున్నది. అర్ధం కాకుండా పోతున్నది. ఇలా ఎందుకు జరుగుతోందనేది అర్ధం చేసుకోవడానికి మనిషికి సమయం సరిపోవడం లేదు. అంతా బిజీ, గజిబిజి. జీవితం ఉరుకుల, పరుగుల ప్రయాణంగా మారింది.

ఎప్పటికపుడు పాతరోజులే బాగున్నాయని అనుకుంటూ జీవితాన్ని నిట్టూర్పుతో నెట్టుకొస్తున్నారు కొందరు. ఇంకా పాత చింతకాయపచ్చడేంటంటూ ఉరుకులెత్తుతున్నారు కొందరు. ఏది పాతది? ఏది కొత్తది? అన్నది కాదు కావలిసింది. ఏది మంచిది? ఏది కొనసాగించాలి? ఏది ఎలా మార్చుకోవాలి? అన్నది ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ దిశగా ఆచరణ ఉండేలా అడుగులు వేయాలి. నిజానికి జీవితంలో ఎపుడూ పాతకొత్తల మేలు కలయికే మంచి ఫలితాలని ఇస్తుంది. నేటి సమాజంలో ఎవడి గోల వాడిది. ఎవడి గోల్‌ వాడిది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అందరూ ఎవరి బిజీలో వారుంటున్నారు. తనను తాను గానీ, తనవాళ్ళను గానీ పట్టించుకోలేనంత బిజీతో సంపాదించేది దేనికోసం? ఎవరి కోసం? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆ దిశగా ఆలోచించే సమయం కూడా ఉండడం లేదు.

మానవ సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. పలకరింపులతో సహా అన్నింటా వ్యాపారతత్త్వం పెరిగిపోతుండడం బాధాకరం. అంతా బాగేనా? అనే పలకరింతలో బాగా సంపాదిస్తున్నారా? అనే అర్ధమే ఉంటోంది. ఒకపుడు అంతా బాగేనా? అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా బాగుందా? అని అర్ధం చేసుకునేవారు. నేటి పలకరింపుకు అర్ధం మారింది. భార్యా, భర్తలిరువురూ సంపాదిస్తే తప్ప ఇలలు గడవడం లేదు. ఈ క్రమంలో బాల్యం బందీ అవుతోంది. వృద్ధాప్యం శాపంగా మరింది. పల్లెలనుండి వలసలు పెరుగుతున్నాయి. ఉమ్మడి తత్త్వం మంట గలిసిపోతోంది. ఆటపాటలు, మంచి చెడు, పండుగలు, పబ్బాలు..... అన్నింటా కొత్త సంస్కృతి వచ్చేస్తోంది. అడుగడుగునా అన్నీ ‘సరుకు’లుగా మారిపోతున్నాయి. ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కోవచ్చు. ఏర్పాటుచేసుకోవచ్చనే దుస్థితికి వచ్చేస్తున్నాము. ఏ 'విలువలూ' 'విలువ’ గా మారకుండా ఆపలేకపోతున్నామా? మనిషి మనిషిగా కాక వినియోగదారుడిగా మారిపోతున్నాడు. సరుకుమాయలో పడిపోతున్నాడు. అనివార్యంగా మార్చబడుతున్నాడు. బంధాలు, బంధుత్వాలే కాదు, వ్యక్తిగతంగా కనీసం తన ఆరోగ్యంను సైతం తాను కాపాడుకోలేనంత వేగంగా సంపాదించే యంత్రంగా మారిపోతున్నాడు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతున్నారు.

ఈ పరిస్థితి మారాలి. మనిషి 'మనిషి'గా మారాలి. మనసును ‘సరుకుమాయ’కు లోనుకాకుండా చేసుకోవాలి. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడుగా, నీడగా నిలచే మానవ సంబంధాలను, విలువలను కాపాడుకోవాలి. మనిషి తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారకుండా, డబ్బునే తన బానిసగా చేసుకునేంతగా ఎదగాలి. మనిషినీ-మనిషినీ, మనిషినీ-మనసునూ విడదీసే డబ్బుకోసం అవసరానికి మించిన పరుగులు తీయడం మానుకోవాలి. విజ్ఞత, వివేకం కోల్పోని సమిష్టి తత్వ్తాన్ని పెంచుకోవాలి. నలుగురితో కలిసి ఉండడం, నలుగురి కోసం ఉండడం నేర్చుకోవాలి. అందులో ఉండే అసలైన ఆనందాన్ని ఆస్వాదించగగాలి. అందుకే వేగం గమనంలో ఉండాలి.

- పల్లా కొండల రావు,
౦8 జులై, 2018.

( జనవిజయం వీక్లీ ఎడిటోరియల్ కోసం వ్రాసినది )

Saturday, 7 July 2018

'నేనూ' చెప్పదలచుకున్నాను!


'మై వాయిస్' కు స్వాగతం!

బ్లాగు అనే మాధ్యమం 2011 లో నాకు పరిచయమైంది. అరవింద్ ద్వారా బ్లాగు అంటే ఏమిటి? ఎలా క్రియేట్ చేయాలి?  వంటి విషయాలు నేర్చుకున్నాను. బ్లాగు ప్రపంచం లో అగ్రిగేటర్లు గురించి తెలిసాక వాటి ద్వారా ఇతర బ్లాగులు చాలా చూడడం జరిగింది. అనేక బ్లాగులనుండి, బ్లాగర్లనుండి,  గూగుల్ ప్లస్ మిత్రులనుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్లాగు ప్రపంచంలో నా అనుభావాలు గురించి పల్లెప్రపంచం బ్లాగులో వ్రాశాను. కొందరు బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసాను. ప్రశ్నిస్తే మీ అభిప్రాయాలు పంచుకున్నారు. జనవిజయం కు మీ వ్యాసాలు వ్రాశారు. తెలుగు-వెలుగు కు సహకారం అందించారు. నచ్చిన పాటలు తెలిపారు. పల్లెప్రపంచం  కార్యక్రమాలను ఆదరించారు. ఇలా నేనే ప్రయోగం చేసినా ఆదరించారు. ఆ మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు.

బ్లాగు ప్రపంచంలోనూ బయట ప్రపంచంలో మాదిరిగానే ఆటంకాలు కల్పించేవారూ, ఈర్శ్యాపరులూ, అపార్ధం చేసుకునేవారూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల వల్ల నేను ఇబ్బందిగా ఫీల్ అయి 'ప్రజ' తో సహా నేను నడిపే అన్ని  బ్లాగులు రద్దు చేసుకుని అన్నింటిలోని ముఖ్యమైన పోస్టులు 'పల్లెప్రపంచం' బ్లాగులోకి మెర్జ్ చేశాను. ఆ సందర్భంలో 'ప్రయాణం' అనే పేరుతొ ఉన్న ఒక బ్లాగును కూడా 'పల్లెప్రపంచం' లోకి  కలిపేశాను. ఇది అయిష్టంగా చేసిన పని. మిగతా అన్ని అంశాలూ విడి విడిగా ఉన్నవి అన్నీ కలిపి 'పల్లెప్రపచం' బ్లాగులో ఉంచడం వలన నష్టం లేదు. కానీ 'ప్రయాణం' లో కేవలం వ్యక్తిగతంగా వ్రాసుకోవడానికి స్టార్ట్ చేసినది రద్దు చేయడం అసంతృప్తిగా ఉండేది.

ఎవడో ఎదో అన్నాడని మనకు ఇష్టమైన పని మానుకోవడం తప్పేనని తెలుసు. తెలిసి తెలిసి ఆ తప్పు ఎందుకు చేయాలి? అలా విమర్శలు చేయడం వలన మిగతా బ్లాగులన్నీ ఒకేచోట కలపడం వలన నాకు ఉపయోగం జరిగింది. వ్యక్తిగతంగా నేను వ్రాయదలచుకున్నవీ, వివిధ అంశాలపై నా అభిప్రాయాలూ, నా వ్యక్తిగత అనుభవాలు, మొత్తంగా నేను చెప్పదలచుకున్నవి 'ప్రయాణం' బ్లాగులో వ్రాయాలనుకున్నాను. కానీ కేవలం 3 పోస్టులతో అపుడా ప్రయాణం ఆగింది. అదే ప్రయాణం ఇపుడు మళ్ళీ ఇలా ప్రారంభిస్తున్నాను. 

ఈ 'ప్రయాణం'లో నేను చెప్పదలచుకున్నవి, నేర్చుకోదలచుకున్నవి అన్నీ వీలైనపుడల్లా వ్రాస్తాను. నాకు వ్రాయడం నేర్పిన బ్లాగు ప్రపంచానికి నేను చెప్పేవి, నా అనుభవాలు ఏ మాత్రం ఉపయోగపడినా సంతోషం. ఏ ఒక్క పోస్టు ఎవరినైనా ఆలోచింపజేసినా, ప్రభావం చూపినా సంతోషమే. ఈ బ్లాగు ప్రపంచంలో ఇబ్బంది పెట్టేవారే కాదు, నేను వ్రాసినా చదివే వారూ, అభిప్రాయాలు పంచుకునేవారూ ఉన్నారు. అందుకే ఈ టపాకు 'నేనూ చెప్పదలచుకున్నాను' అని హెడింగ్ ఉంచాను. సో.... నేనూ చెప్పదలచుకున్నాను. బాగున్నవి స్వీకరించండి. బాగాలేనివి కామెంట్ ద్వారా చెప్పండి.
- పల్లా కొండల రావు,
7జులై,2018