Sunday 8 July 2018

వేగం గమనంలో ఉండాలి


వేగం గమనంలో ఉండాలి

నేటి మానవ జీవితంలో వేగం పెరిగింది. అది అవసరానికి మించి ఉంటోంది. శృతి మించిన వేగం మనిషిని అనేక విధాలుగా నష్టపరుస్తోంది. వేగం వలన కలిగే మంచిని ఉపయోగించుకోవాల్సిందే. అవసరమైన చోట వేగం కొనసాగించాలి. కానీ అదే వేగం మనిషి తత్త్వానికి, మానవత్వానికే 'సవాల్‌'గా మారితే ఏం చేయాలి? ప్రస్తుతం చాలా విషయాలలో వేగం శృతి మించుతోంది. వేగం మనిషిని అతలాకుతం చేస్తోంది. మనసును కల్లోలపరుస్తోంది. మానవ సంబంధాలను మంట గలుపుతోంది. అందరం ఆగి చూసుకోవసిన అవసరం ఉంది. మనం అవసరమైన వేగం కొనసాగిస్తున్నామా? అవసరానికి మించిన వేగంలో మునిగిపోతున్నామా? అనేది తేల్చుకోవలసి వచ్చింది.

మనిషికి జ్ఞానం ఎదిగే కొద్దీ బుద్ధి తగ్గుతోందనిపిస్తోంది. మనిషి అవసరాలకోసం తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారాడు. డబ్బు కోసం పరుగులు పెడుతున్నాడు. డబ్బు ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. జీవితాన్ని నిత్యం పరుగెత్తిస్తున్నాడు. డబ్బు కోసం సృష్టించబడిన 'సరుకుమాయ'లో పడిపోతున్నాడు. డబ్బు సృష్టించే సమస్యతో సతమతమవుతున్నాడు. డబ్బు సంపాదించడం కోసం పోటీపడుతున్నాడు. అవసరం కోసం కొందరు, ఆధిపత్యం కోసం కొందరు ఎలా అయితేనేం డబ్బు మనిషిని, మనసును స్థిమితంగా ఉంచడం లేదు. పరుగు పెట్టిస్దోంది. ఈ క్రమంలో మనిషికి రానురాను మెదడు పెరుగుతోంది, కానీ హృదయం తరుగుతోంది. ఏది గొప్పది? ఏది సాధించాలి? ఏది సంతృప్తినిస్తోంది? అనేదానికి అర్ధం లేకుండా పోతున్నది. అర్ధం మారిపోతున్నది. అర్ధం కాకుండా పోతున్నది. ఇలా ఎందుకు జరుగుతోందనేది అర్ధం చేసుకోవడానికి మనిషికి సమయం సరిపోవడం లేదు. అంతా బిజీ, గజిబిజి. జీవితం ఉరుకుల, పరుగుల ప్రయాణంగా మారింది.

ఎప్పటికపుడు పాతరోజులే బాగున్నాయని అనుకుంటూ జీవితాన్ని నిట్టూర్పుతో నెట్టుకొస్తున్నారు కొందరు. ఇంకా పాత చింతకాయపచ్చడేంటంటూ ఉరుకులెత్తుతున్నారు కొందరు. ఏది పాతది? ఏది కొత్తది? అన్నది కాదు కావలిసింది. ఏది మంచిది? ఏది కొనసాగించాలి? ఏది ఎలా మార్చుకోవాలి? అన్నది ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ దిశగా ఆచరణ ఉండేలా అడుగులు వేయాలి. నిజానికి జీవితంలో ఎపుడూ పాతకొత్తల మేలు కలయికే మంచి ఫలితాలని ఇస్తుంది. నేటి సమాజంలో ఎవడి గోల వాడిది. ఎవడి గోల్‌ వాడిది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అందరూ ఎవరి బిజీలో వారుంటున్నారు. తనను తాను గానీ, తనవాళ్ళను గానీ పట్టించుకోలేనంత బిజీతో సంపాదించేది దేనికోసం? ఎవరి కోసం? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆ దిశగా ఆలోచించే సమయం కూడా ఉండడం లేదు.

మానవ సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. పలకరింపులతో సహా అన్నింటా వ్యాపారతత్త్వం పెరిగిపోతుండడం బాధాకరం. అంతా బాగేనా? అనే పలకరింతలో బాగా సంపాదిస్తున్నారా? అనే అర్ధమే ఉంటోంది. ఒకపుడు అంతా బాగేనా? అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా బాగుందా? అని అర్ధం చేసుకునేవారు. నేటి పలకరింపుకు అర్ధం మారింది. భార్యా, భర్తలిరువురూ సంపాదిస్తే తప్ప ఇలలు గడవడం లేదు. ఈ క్రమంలో బాల్యం బందీ అవుతోంది. వృద్ధాప్యం శాపంగా మరింది. పల్లెలనుండి వలసలు పెరుగుతున్నాయి. ఉమ్మడి తత్త్వం మంట గలిసిపోతోంది. ఆటపాటలు, మంచి చెడు, పండుగలు, పబ్బాలు..... అన్నింటా కొత్త సంస్కృతి వచ్చేస్తోంది. అడుగడుగునా అన్నీ ‘సరుకు’లుగా మారిపోతున్నాయి. ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కోవచ్చు. ఏర్పాటుచేసుకోవచ్చనే దుస్థితికి వచ్చేస్తున్నాము. ఏ 'విలువలూ' 'విలువ’ గా మారకుండా ఆపలేకపోతున్నామా? మనిషి మనిషిగా కాక వినియోగదారుడిగా మారిపోతున్నాడు. సరుకుమాయలో పడిపోతున్నాడు. అనివార్యంగా మార్చబడుతున్నాడు. బంధాలు, బంధుత్వాలే కాదు, వ్యక్తిగతంగా కనీసం తన ఆరోగ్యంను సైతం తాను కాపాడుకోలేనంత వేగంగా సంపాదించే యంత్రంగా మారిపోతున్నాడు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతున్నారు.

ఈ పరిస్థితి మారాలి. మనిషి 'మనిషి'గా మారాలి. మనసును ‘సరుకుమాయ’కు లోనుకాకుండా చేసుకోవాలి. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడుగా, నీడగా నిలచే మానవ సంబంధాలను, విలువలను కాపాడుకోవాలి. మనిషి తాను సృష్టించిన డబ్బుకు బానిసగా మారకుండా, డబ్బునే తన బానిసగా చేసుకునేంతగా ఎదగాలి. మనిషినీ-మనిషినీ, మనిషినీ-మనసునూ విడదీసే డబ్బుకోసం అవసరానికి మించిన పరుగులు తీయడం మానుకోవాలి. విజ్ఞత, వివేకం కోల్పోని సమిష్టి తత్వ్తాన్ని పెంచుకోవాలి. నలుగురితో కలిసి ఉండడం, నలుగురి కోసం ఉండడం నేర్చుకోవాలి. అందులో ఉండే అసలైన ఆనందాన్ని ఆస్వాదించగగాలి. అందుకే వేగం గమనంలో ఉండాలి.

- పల్లా కొండల రావు,
౦8 జులై, 2018.

( జనవిజయం వీక్లీ ఎడిటోరియల్ కోసం వ్రాసినది )